ఆధునిక జీవన శైలికి అద్దం పట్టిన కథ
హృదయాన్ని హత్తుకునే సహజ పాత్రలు
Tourist Family Movie Review In Telugu 03/06/2025 మనిషిగా పుట్టిన తర్వాత మనకంటూ నలుగురు మనుషుల్ని సంపాదించుకోవాలి. మనం సంపాదించుకున్న ఆస్తులు, అంతస్తులు మనతో రావు. కష్ట కాలంలో మనల్ని ఆదుకునేది మనుషులే కానీ డబ్బు ఎంత మాత్రం కాదు. ప్రస్తుత సమాజంలో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయాయి. ఎవరి జీవితం వాళ్ళదే అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఉదయం లేచిన దగ్గర్నుంచి, రాత్రి పడుకునే వరకూ తన గురించే గానీ ఇతరులను పట్టించుకునే తీరిక మనిషికి లేకుండాపోతోంది. ఇలా నేటి సమాజంలో మారిపోతున్న మనుషుల మనస్తత్వాలను, జీవన చిత్రాలను అద్భుతంగా ఆవిష్కరిస్తూ “టూరిస్ట్ ఫ్యామిలీ” సినిమా ఇప్పుడు ott ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
ఒటిటి స్ట్రీమింగ్ ఎక్కడ?
ఏప్రిల్ 29న తమిళంలో థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ott తెలుగు వెర్షన్ తో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో జూన్ రెండో తారీకు నుండి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు 8 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ హార్ట్ టచింగ్ ఫ్యామిలీ మూవీ, దాదాపు 80 కోట్లకు పైగానే వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
కథ ఏంటి?
కమర్షియల్ సినిమానా? ఆర్ట్ సినిమానా?
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా కమర్షియల్ సినిమా కాదు. అలాగని ఆర్ట్ సినిమా, ట్విస్ట్ లతో పిచ్చేక్కించే థ్రిల్లర్ సినిమా కూడా కాదు. ఇది ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకునే హృద్యమైన కుటుంభ కథా చిత్రం. ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే అరుదైన చిత్రం. శ్రీలంకలో ఏర్పడిన ద్రవ్యోల్బణ పరిస్థితుల కారణంగా అక్కడ ఉంటున్న ఒక ఫ్యామిలీ పెరిగిన రేట్ల వల్ల బ్రతుకుతెరువు కష్టమై, తమిళనాడులోని రామేశ్వరానికి అక్రమంగా వలస వస్తుంది. తమ బంధువైన ఒక వ్యక్తి సాయంతో ఫేక్ ఆధారాలతో ఒక కాలనీలో నివాసం ఉంటుంది. అదే సమయంలో రామేశ్వరంలోని ఒక ప్రాంతంలో బాంబు పేలుడు జరుగుతుంది. దీనికి శ్రీలంక నుంచి వలస వచ్చిన శరణార్థులే కారణమై ఉంటారని పోలీసులు అనుమానిస్తారు. ఈ నేపథ్యంలో పోలీసుల కన్ను ఈ టూరిస్ట్ ఫ్యామిలీ పై పడుతుంది. ఈ బాంబ్ బ్లాస్టింగ్ కి, హీరో ఫ్యామిలీకి సంబంధమేమిటి? అసలు వాళ్ళు ఎవరు? అనేది చివరి వరకూ దర్శకుడు అభిషణ్ జివంత్ ఆసక్తికరంగా తర్కెక్కించాడు.
నటీనటుల వివరాలు
| యాక్టర్స్ | పాత్ర పేరు |
| శశి కుమార్ | ధర్మదాస్ |
| సిమ్రాన్ | వాసంతి |
| మిథున్ జై శంకర్ | నిదుషమ్ |
| కమలేష్ జగన్ | మల్లి |
| యోగి బాబు | ప్రకాష్ |
| రమేష్ తిలక్ | పోలీస్ హెడ్ కానిస్టేబుల్ |

సినిమా ఎలా ఉంది?
చూడొచ్చా? టైమ్ వేస్టా?
ఓటిటి హవా స్టార్ట్ అయిన తర్వాత చాలామంది సినిమా లవర్స్ మలయాళం లో వచ్చే క్రైమ్ థ్రిల్లర్స్ ని విపరీతంగా ఇష్టపడుతున్నారు. మలయాళ సినీ పరిశ్రమ ఒకరకంగా ఓటిటి ని శాసిస్తోందని చెప్పొచ్చు. అలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లింగ్ సినిమాల మధ్యలో “టూరిస్ట్ ఫ్యామిలీ” ఒక ఫీల్ గుడ్ మూవీ గా చెప్పొచ్చు. ప్రతి సన్నివేశం సహజంగా, ప్రతి పాత్రను అత్యంత సహజంగా ఈ సినిమాలో చూపించారు. ఒక కాలనీ వేదికగా చేసుకుని మనుషుల మనస్తత్వాలను, కుటుంబ పరిస్థితులను సింపుల్ గా చక్కగా చూడముచ్చటగా చిత్రీకరించారు.
హృదయాన్ని స్పృశించే కథాంశం
మన లైఫ్ లో రకరకాల కోణాలు ఉన్నట్టే, సినిమాల్లో కూడా రకరకాల సినిమాలు ఉంటాయి. కమర్షియల్ హంగులతో కూడిన సినిమాలను రెగ్యులర్ గా చూస్తూ ఇష్టపడే మనం అప్పుడప్పుడు మనల్ని మనం తెరపై చూసుకునే ఇలాంటి సినిమాలను కూడా చూడాలి. ప్రతి ఒక్కరి హృదయాన్ని స్పృశించే కథాంశం ఇందులో ఉండటంతో టూరిస్ట్ ఫ్యామిలీ హార్ట్ టచ్చింగ్ మూవీ గా థియేటర్స్ లో ఘనవిజయం అందుకుంది. తమిళం లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఒటిటి లోనూ మంచి రివ్యూస్ రేటింగ్ తో విజయపథంలో దూసుకెళ్తుంది.
సింపుల్ ఫ్యామిలీ
సింపుల్ స్టొరీ
భారీ బిల్డప్ తో హీరో ఎలివేషన్స్ సీన్స్, పంచ్ డైలాగులు, ఐటెం సాంగ్స్, దుమ్ము దులిపే యాక్షన్ సీన్స్ ఇందులో ఉండవు. ఈ కథలో ఉన్నదంతా సింప్లిసిటీ మాత్రమే. అదే ఈ చిత్రానికి ఆయువుపట్టుగా మారింది. మితిమీరిన అతిశయాలు, మాస్ ఎలిమెంట్స్, కమర్షియల్ పాయింట్స్ లెక్క వేసుకుని ఈ సినిమా తీయలేదు. సాటి మనిషి మరొక మనిషికి సాయంగా ఉంటే, మనిషిగా పుట్టిన మన జన్మకి సార్ధకత అనే టిపికల్ పాయింట్ ని సినిమా కథగా మార్చడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇందులో పాత్రలు, సన్నివేశాలు అన్నీ కూడా అత్యంత సహజంగా ఉంటాయి. మన కాలనీలో మన మధ్య జరిగే సంఘటనల్లా అనిపిస్తాయి.
శశి కుమార్ సహజత్వం
ధర్మదాసుగా ప్రధాన పాత్రలో హీరో శశి కుమార్ అత్యంత సహజంగా నటించారు. ఇంతకుముందు దర్శకుడిగా తన విభిన్న సినిమాలతో సత్తా చూపించిన శశి కుమార్ నటుడుగాను కూడా ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించారు. ఈ సినిమాలో శశికుమార్ చేసిన పెర్ఫార్మెన్స్ తనని మరో రో మెట్టు పైకి ఎక్కిచ్చిందని చెప్పాలి. ఒక సాధరణ కుటుంభ పెద్దగా మెప్పించారు.
ఇక ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా, ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ సిమ్రాన్ ఇందులో వాసంతిగా ధర్మదాసు భార్యగా నటించారు. ఇద్దరు పిల్లల తల్లిగా సిమ్రాన్ చేసిన క్యారెక్టర్ మన కాలనీలో కనిపించే ఒక సాధారణ గృహిణి పాత్రను పోలి ఉంటుంది. ఎక్కువ మెలోడ్రామా లేకుండా, చిన్న చిన్న ఎమోషన్ సీన్స్ లో సిమ్రాన్ నటించిన తీరు చక్కగా కుదిరింది. ఇక పిల్లల క్యారెక్టర్ లో నటించిన కమలేష్, నిదర్శన్ కూడా సినిమాకి బలమయ్యారు. మరో చక్కటి కామెడీ పాత్రలో యోగి బాబు తనదైన శైలిలో నవ్వులు పండించారు.
ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్
రొటీన్ సినిమాలతో విసిగిపోయిన సినీ లవర్స్ కి హాయిగా రిలీఫ్ అందించే చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ. ఇటీవల మన తెలుగులో వచ్చిన అనగనగా ఎలాంటి ఫీల్ ని అందించిందో ఇంచుమించు అదే రేంజ్ లో ఈ సినిమా కూడా మన మనసుకు హత్తుకుంటుంది. ఉరుకుల పరుగుల ఈ జీవన పయనంలో ఇలాంటి ఇలాంటి సినిమాలను ప్రతి ఒక్కరూ చూడాలి. మనం ఏం చేస్తున్నాం? ఏం కోల్పోతున్నాం అనే విషయాన్ని సున్నితంగా చూపించారు. అయితే క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఊహించే భయంకరమైన ట్విస్టులు ఈ సినిమాలో ఉండవు. దాదాపు రెండు గంటల నిడివితో టూరిస్ట్ ఫ్యామిలీ ఎక్కడ బోర్ కొట్టకుండా, సింపుల్ గా హాయిగా సాగిపోతుంది. ఫ్యామిలీ అంతా హ్యాపీగా కూర్చుని. తప్పక చూడాల్సిన చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ. ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.








