Pawan Kalyan Badri Completed 25 Years : “నువ్వు నందా అయితే, నేను బద్రి… బద్రీనాథ్. అయితే ఏంటి” అంటూ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ గా చెప్పిన సింగిల్ లైన్ డైలాగ్ డిటిఎస్ థియేటర్లో ఆరోజుల్లో దద్దరిల్లిపోయింది. బద్రిగా పవన్ నట విశ్వరూపాన్ని సిల్వర్ స్క్రీన్ పై పవర్ ఫుల్ గా చూపించింది. ఇది కదా.. చిరంజీవి తమ్ముడు అంటే.. ఇది కదా పవర్ స్టార్ అంటే అంటూ మెగా అభిమానులు బద్రి సినిమాను చూసి పులకరించిపోయారు. పవన్ కళ్యాణ్ సినిమా కెరియర్లో పవర్ ఫుల్ యూత్ ఫుల్ హిట్ సినిమాగా ఒక ప్రత్యేకతను సంతరించుకున్న బద్రి సినిమా విడుదలై నేటికి 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బద్రి సినిమా వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు మీకోసం..
పవర్ స్టార్
పవర్ చూపించిన సినిమా
తన మొదటి సినిమా “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” తో ఊహించిన సక్సెస్ అందుకోలేక పోయిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాతో కేవలం, చిరంజీవి తమ్ముడు ఫైట్స్ బాగా చేస్తాడు, డాన్స్ బానే చేస్తున్నాడు.. అనే ప్రశంసలు మాత్రమే అందుకున్నాడు. నటనపరంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఇక సినిమాలకు స్వస్తి చెబుదామని, సినిమాలకు దూరమైన సమయంలో అనేక ఇబ్బందుల మధ్య గోకులంలో సీత తెరకెక్కింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే స్క్రీన్ నేమ్ మొదటగా కనిపించింది గోకులంలో సీత స్క్రీన్ పైనే. ఆ సినిమాతో కూడా అంతంతమాత్రంగానే ఆకట్టుకున్న పవన్ నటన తర్వాత వచ్చిన సుస్వాగతం సినిమాతో, యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది.
తొలిప్రేమ లాంటి కల్ట్ క్లాసిక్ తర్వాత
సుస్వాగతం సినిమాతో కొద్దిగా నిలదొక్కుకున్న పవన్ కళ్యాణ్ ఇక తన టేస్ట్ కి తగ్గట్టు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలోనే తమిళ యువ దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వ ప్రయత్నాల్లో ఉండగా పవన్ అతనికి అవకాశం ఇచ్చారు. కరుణాకరన్ కథకి, పవన్ కళ్యాణ్ దిద్దిన మెరుగులు తొలిప్రేమ సినిమాని ఒక కల్ట్ క్లాసిక్ హిట్టుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిలిచిపోయేలా చేసాయి. ఆ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహాలు, సూచనలు తొలిప్రేమ సినిమాకి ఒక కొత్త రూపాన్నిఅద్దాయి. పక్కింటి కుర్రోడుగా, పవన్ కళ్యాణ్ చూపించిన అభినయం మహిళా ప్రేక్షకులను, యూత్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి.
పవన్ లోని దర్శకుడు
కొత్త కుర్రాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు
చిరంజీవి కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న టైంలో నిజానికి పవన్ కళ్యాణ్ దర్శకుడు అవ్వాలని కలలుగన్నారు. ఏదైనా సినిమా చూసి దానికి తనదైన మార్పులు చెప్పి, ఇలా ఉంటే బాగుండేది అని చిరంజీవితో పవన్ డిస్కస్ చేస్తూ ఉండేవారట. ఆ టైంలోనే పవన్ లో ఒక మంచి దర్శకుడు ఉన్నాడని, ఎవరి దగ్గరైనా దర్శకత్వ శాఖలో చేరిస్తే మంచి దర్శకుడుగా రాణించే అవకాశం ఉందని చిరంజీవి అనుకునేవారట. లంకేశ్వరుడు సినిమాకి దాసరి వద్ద కొన్ని రోజులు పనిచేసారట. అయితే మనం ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలుస్తుంది అన్నట్టుగా, నటనలో ఏమాత్రం ఓనమాలు తెలియని పవన్ కళ్యాణ్ ఒక స్టార్ హీరోగా ఇంతటి మహోన్నత స్థాయిని అందుకుంటాడని ఎవరూ కూడా ఊహించలేదు.
సెవెన్ వండర్స్
ఇదే పవన్ కెరీర్ టాప్ గేర్
కేవలం ఏడే ఏడు సినిమాల తో పవన్ కళ్యాణ్ కీర్తి శిఖరాగ్రస్థాయికి చేరింది. దర్శకత్వం పైన, సాంకేతికంగా పలు విభాగాల పై మొదటి నుంచి మంచి పట్టు ఉన్న పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సంచలన విజయం తర్వాత తమ్ముడు సినిమాకి శ్రీకారం చుట్టారు. మరో కొత్త దర్శకుడు పీఏ అరుణ్ ప్రసాద్ కి అవకాశం ఇస్తూ పవన్ కళ్యాణ్ “తమ్ముడు” సినిమాకి సైన్ చేశారు. అప్పటికే తొలిప్రేమ సినిమాకి పవన్ ఇచ్చిన ఐడియాస్ వర్క్ అవుట్ అవ్వడంతో, తమ్ముడు సినిమాకి కూడా ధైర్యంగా తన ఇన్ పుట్స్ అందించారు పవన్ కళ్యాణ్. అది కూడా ఓ ట్రెండీ మూవీ గా సంచలనం సృష్టించింది.
విక్రమార్కుడు..పవన్
పట్టు వదిలే ప్రసక్తే లేదు
ఒక మామూలు యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా తీయాల్సిన తమ్ముడు సినిమాని. తనకున్న మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ తో ఒక కిక్ బాక్సింగ్ నేపథ్యం ఉన్న సినిమాగా మలిచారు. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్, హెయిర్ స్టైల్, వాకింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ యూత్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుని, పవన్ ని యూత్ ఐకాన్ గా మార్చేశాయి. ప్రతి సినిమాకి తన ఇన్వాల్వ్మెంట్, తన ఐడియాస్ అద్భుతంగా వర్కౌట్ అవుతుండడంతో ఆ తరువాత చేయాలనుకున్న “బద్రి” సినిమాకి కూడా పవన్ తనదైన శైలి మెరుగులను అద్ది ఒక పర్ఫెక్ట్ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ గా “బద్రి” సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.

పూరీ ప్లాన్ సక్సెస్
ఇట్లు..మీ బద్రి
అప్పటికే అనేక కథలు రెడీ చేసుకుని దర్శకుడు అవుతామని ప్రయత్నాలు ప్రారంభించిన పూరి జగన్నాథ్, అప్పటికే హీరోగా ప్రూవ్ చేసుకున్న పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకి పవన్ పరిచయం లేకపోవడంతో, డైరెక్ట్ గా పవన్ కి కథ చెప్పే ఛాన్స్ లేకపోవడంతో తనకి పరిచయం ఉన్న చోటాకేనాయుడి నాయుడుని అడిగారు పూరీజగన్నాథ్. మొదట తనకి కథ చెప్పాలని, అది తనకు నచ్చితే కళ్యాణ్ తో మాట్లాడుతానని చోటా కె నాయుడు చెప్పడంతో, టిపికల్ గా, కదా ఏమీ లేనట్టుగా ఉండే బద్రీ కథ చెబితే రిజెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో, పూరి జగన్నాథ్ “ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం” కథను చోటా కె నాయుడుకి వినిపించారు పూరీ. ఆ కథ ఎంతో బాగా నచ్చడంతో కళ్యాణ్ కి ఫోన్ చేసి, కొత్త దర్శకుడు పూరి జగన్నాథ్ వస్తాడని కథ వినమని అడిగాడు. సరేనన్న పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ ని కథ వినటానికి ఒకే చెప్పారు.
తెల్లవారుజాము సిట్టింగ్
పూరీని మెచ్చిన పవర్ స్టార్
కథ చెప్పడానికి తెల్లవారుజాము 4 గంటలకి రమ్మని పవన్ కళ్యాణ్ చెప్పడంతో షాక్ అయిన పూరి రాత్రి మూడు గంటలకే లేచి, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న పవన్ కళ్యాణ్ ఆఫీస్ కి నడుచుకుంటూనే వెళ్లారట. బద్రి కథ విన్న పవన్ కళ్యాణ్ కథ చాలా బాగుందని, అయితే తనతో చోటా కె నాయుడు సూసైడ్ లవ్ స్టోరీ అని చెప్పాడని, ఇందులో సూసైడ్ లాంటిదేమీ లేదు కదా? అని పూరి జగన్నాథ్ ని అడగడంతో పూరి జగన్నాథ్, పవన్ కళ్యాణ్ కి జరిగిందంతా వివరించాడట. బద్రి కథ ముందుగా చెప్తే ఒప్పుకునే ఛాన్స్ ఉండదని, ఇంకో కథ చెప్పానని.. పవన్ కి చెప్పడంతో పవన్ నవ్వి కథ బాగుంది సినిమా చేద్దామని చెప్పారట.
ఇద్దరిదీ ఒకటే మైండ్ సెట్
అయితే .. సినిమా క్లైమాక్స్ ఎందుకో మారిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎలా మారిస్తే బాగుంటుందో నువ్వు ఆలోచించి, మార్చి తీసుకురమ్మని పవన్ పూరికి సూచించాడట. మరో నాలుగు రోజులు ఆగి కలుద్దామని చెప్పారట. అక్కడ నుండి బయటపడ్డ పూరి జగన్నాథ్ కి ఎంత ఆలోచించినా క్లైమాక్స్ అదే ఉంటే బాగుంటుంది.. మారిస్తే బాగోదు అనిపించిందట. నాలుగు రోజుల తర్వాత మళ్లీ సిట్టింగ్ లో కూర్చున్న పవన్ కళ్యాణ్.. క్లైమాక్స్ చెప్పండి ఏమన్నా మార్చారా? అని అడిగారట. లేదండి ఏం మార్చలేదు. అదే క్లైమాక్స్ సెట్ అవుతుంది. ఎంత ఆలోచించినా గానీ అదే కరెక్ట్ అనిపిస్తుంది. అని పవన్ కళ్యాణ్ తో పూరి చెప్పడంతో, పవన్ కన్విన్స్ అయ్యి నాకు కూడా అదే అనిపించింది. నేను చెప్పానని చెప్పి నువ్వు ఏదైనా చేంజ్ చేస్తావేమో అని అలా అన్నానని, పవన్ కళ్యాణ్ పూరితో అన్నారట.

ఇంతకుముందు నా సినిమాలు ఏమైనా చూసారా మీరు? అని పూరిని అడగడంతో నేను మీవి ఏ సినిమాలు మీకు చూడలేదు. నాకు ఒక హీరో కావాలి..దర్శకుడిగా నాకు ఛాన్స్ కావాలి అందుకే వచ్చాను అనటంతో,పూరి ముక్కుసూటి తనం నచ్చిన పవన్ కళ్యాణ్ తన స్టైల్ లో ఒక నవ్వు నవ్వి బద్రి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారట.
హైలెట్స్ అఫ్ బద్రి
- యూత్ కి మెంటల్ ఎక్కించిన పవన్ ఆన్ స్క్రీన్ ఆటిట్యూడ్
- పూరీ రాసిన సింగల్ లైన్ పంచ్ డైలాగ్స్
- అమీషా పటేల్, రేణు దేశాయ్ గ్లామర్
- పవన్ స్టైల్ పవర్ ఫుల్ ఏక్షన్ సీన్స్
- థియేటర్ లో డాన్సులు వేయించిన రమణ గోగుల ట్రెండీ మ్యూజిక్
- పవన్ స్టైలింగ్, బాడీ లాంగ్వేజ్
- ఫ్రెష్ లుక్ తో నిండిపోయిన పూరీ టేకింగ్ స్టైల్
ఫస్ట్ డే నే అదరగొట్టిన పూరీ
100 సినిమాలు చేస్తావ్
అప్పటికే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్ర హీరోలతో సినిమాలను నిర్మించిన అగ్ర నిర్మాత టి. త్రివిక్రమ రావు బద్రి సినిమాకి నిర్మాత. పవన్ కళ్యాణ్ కి యూత్ లో ఉన్న క్రేజ్, వర్క్ అవుట్ అవుతున్న పవన్ కళ్యాణ్ ఐడియాలజీ, వీటన్నిటి మీద నమ్మకం ఉన్నా.. కొత్త దర్శకుడు ఎలా డీల్ చేస్తాడో ఏంటో అని అప్పటి వరకు కొత్త దర్శకులతో పని చేయని నిర్మాత త్రివిక్రమ్ రావు సందేహం వ్యక్తం చేసారట. దర్శకుడిని మారుద్దాం, కథ అదే చేద్దాం అని పవన్ కళ్యాణ్ కి చెప్పారట. అప్పటికే కొత్తవాళ్ళను ప్రోత్సహిస్తున్న పవన్, పూరి జగన్నాథ్ ప్రతిభ పై ఎంతో నమ్మకం ఉండడంతో ఆ మాటకి అడ్డు చెబుతూ కావాలంటే మరో సినిమా మీకు చేస్తాను.. ఈ సినిమా మాత్రం ఆ కుర్రాడు పూరితో చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఇక చేసేదేమీ లేక నిర్మాత త్రివిక్రమ్ రావు బద్రి సినిమాకి కొబ్బరికాయ కొట్టారు.

మెగాస్టార్ చిరంజీవి క్లాప్ తో ప్రారంభమైన బద్రి సినిమా తొలిరోజు షూటింగ్.. పూరి జగన్నాథ్ షూటింగ్ ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడో చూద్దామని, నిర్మాత త్రివిక్రమరావు సెట్లో పక్కనే కూర్చుని అన్నీ గమనిస్తూ కూర్చున్నారట. ఉదయం షూటింగ్ ప్రారంభించిన పూరి జగన్నాథ్ విపరీతమైన క్లారిటీతో, మధ్యాహ్నానికే రెండు సీన్స్ షూట్ కంప్లీట్ చేయడంతో, పూరి స్పీడ్ కి ఆశ్చర్యపోయిన నిర్మాత త్రివిక్రమ్ రావు.. పూరి జగన్నాథ్ దగ్గరకు వచ్చి షేక్ అండ్ ఇచ్చి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది.. 100 సినిమాలు గ్యారెంటీగా తీసే సత్తా నీలో ఉంది.. అంటూ అభినందించారట.
తెలుగు టీవీ సీరియల్స్ స్టొరీ ముందుగా తెలుసుకోవాలంటే ఇక్కడ click చేయండి: https://entertainment999.in/category/tv-serials/
ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్ తొలి అడుగులు
బద్రి సినిమాతో తన తొలి అడుగులు వేసిన పూరి జగన్నాథ్ ఆ తర్వాత ఒక సంచలనం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మైల్ స్టోన్ గా నిలిచిపోయే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ని తక్కువ టైంలో, తక్కువ ఖర్చుతో తెరకెక్కించి నిర్మాతకి కాసుల వర్షం కురిపించిన టాలెంటెడ్ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పటికీ ఒక పేజీ ఉంటుంది. ఆ పేజీలో తొలి వాక్యంగా తను దర్శకుడిగా పరిచయమైన ఈ బద్రి సినిమా ఎప్పటికీ ఉండిపోతుంది.
అన్నిట్లోనూ కొత్తదనమే
బద్రి సినిమా విడుదలయ్యే టైం సమయానికి, కొత్తదనం అంటే.. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే.. కొత్తదనం. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని పవన్ అభిరుచి తగ్గట్టుగా ఆఫీస్ సెట్స్ ని కళా దర్శకుడు ఆనంద్ సాయి అద్భుతంగా రూపొందించారు. అప్పటివరకు ఆర్టిఫిషియల్ సెట్స్ లాంటివి చూసి అలవాటు పడిన ఆడియన్స్ కి పవన్ కళ్యాణ్ సినిమాల్లో కనిపించే ఏంబియన్స్ విపరీతంగా నచ్చింది. ఒక మామూలు కథకి, ఒక అద్భుతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో పవన్ కళ్యాణ్ తొలిప్రేమ నుంచి కూడా తనదైన ప్రతిభ చూపించారు. తొలిప్రేమ నుండి కూడా అందరూ కొత్త దర్శకులతో పవన్ పని చేయడంతో పవన్ ఐడియాస్, ఆ దర్శకుల విజన్ రెండు కలిసి పవన్ నటించిన సినిమాల్ని ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ గా ప్రేక్షకుల ముందు నిలబెట్టాయి.
ఆ సినిమాల్లో డిఫరెంట్ యాక్షన్ స్కిల్స్ తో మెప్పించిన పవన్ కళ్యాణ్, అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరో స్థాయికి ఎదిగి, ఏ హీరోకి లేనటువంటి ఒక యూనిట్ స్టైల్ ని సంపాదించుకున్నారు. పవన్ కళ్యాణ్ యూత్ ఆడియన్స్ లోకి అంత స్పీడుగా వెళ్లడానికి ఈ అంశాలే దోహదపడ్డాయి అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ట్రెండ్ సెట్టర్ బద్రి
ఇక బద్రి సినిమా విషయానికొస్తే.. సినిమా మొదలైన మొదటి నుండీ కొత్తదనమే. అప్పటివరకు సినిమా టైటిల్స్ లో ఫస్ట్ మొదటగా హీరో పేరు వేసి తర్వాత కథానాయకిల పేర్లు వేసేవారు. కానీ బద్రి సినిమాలో ముందుగా కథానాయకలు అమీషా పటేల్, రేణు దేశాయ్ వీళ్ళిద్దరి పేర్లు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్, అలాగే ప్రకాష్ రాజ్ పేర్లు పడతాయి. అప్పటికే యూత్ ఫుల్ మాస్ హీరోగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ విధంగా చేయడం అనేది తన సింప్లిసిటీకి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. హీరో సెంట్రిక్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఈ కొత్త పోకడ చూసి సినిమా ప్రముఖులు సైతం ఆశ్చర్యపోయారు. పవన్ ఆలోచనలు చాలా కొత్తగా ఉంటాయని అందరికీ అర్ధం అయ్యింది.
తెలుగు సినిమాలో హిందీ పాట
బద్రి సినిమా మొదలవడంతోనే.. ఒక హిందీ పాటతో మొదలవుతుంది. దేశం గురించి, దేశంలో పెరిగిపోతున్న టెర్రరిజం గురించి, ఆ టెర్రరిజాన్ని ఎలా కంట్రోల్ చేయాలనే అంశాలతో, మాస్ ఎలిమెంట్స్ తో ఆ సాంగ్ ఒక వినూత్న పద్ధతిలో ఉంటుంది. ప్రతీ సినిమాలోనూ మొదటి పాట అర్థవంతమైన పాటగా ఉండాలనుకునే, పవన్ కళ్యాణ్ ఆలోచనలు బద్రి సినిమా నుండి మొదలయ్యే అని చెప్పొచ్చు. తెలుగు సినిమాల్లో హిందీ పాటలు ఏంట్రా బాబు? ఇది ఎక్కడ వెరైటీ రా నాయనా? అంటూ బద్రి సినిమా ఆడియో క్యాసెట్లు విడుదలైన తర్వాత మెగా అభిమానులే ఆశ్చర్యపోయారు.
అప్పటివరకు ఎప్పుడు వినని ట్యూన్స్, ఎప్పుడు వినని పీచు గొంతులు ఇదేంట్రా బాబు.. బద్రి సినిమా పాటలు మొదటి సారి ఉన్నప్పుడు కలిగిన అభిప్రాయం ఇది. కానీ నాలుగైదు రోజుల అయ్యేటప్పటికీ అందరి నోళ్ళలోనూ అవే పాటలు. ఇక సినిమా విడుదలైంది. అప్పటివరకూ ఒక మూస పద్ధతిలో వెళ్తున్న సినిమాలకు బాగా అలవాటు పడిన ప్రేక్షకులకు మొదట బద్రి పెద్ద షాక్ ఇచ్చాడని చెప్పాలి. సినిమా ఎలా ఉంది బాస్? అని ఎవరినైనా అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక బాగుందని, బాలేదని, వెరైటీగా ఉందని, చాలా కొత్తగా ఉందని, చాలా చెత్తగా ఉందని ఇలా మొదటి రోజు రకరకాల కామెంట్స్ బద్రి సినిమాకి వినపడ్డాయి. కానీ అవేమీ కలెక్షన్స్ కి అడ్డుకట్ట వేయలేకపోయాయి. అదీ పవన్ క్రేజ్.
అయితే రెండో రోజు నుంచి పవన్ మేనియాను, పవన్ మేనరిజమ్స్ ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టిన ఆడియన్స్ కి బద్రి ఒక సరికొత్త కిక్ ఇచ్చింది. ఏంట్రా బాబు ఈ డైలాగులు. ఏంట్రా బాబు నేచురల్ ఫైట్స్, ఏంట్రా బావ మ్యూజిక్.. హే చికిత్తా అంటూ, బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే అంటూ డిటిఎస్ సౌండ్స్ లో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి.

పవన్ క్రియేటివిటీ
యూత్ పల్స్ పట్టిన పవర్ స్టార్
బద్రి సినిమాకు, అంతకుముందు వచ్చిన తమ్ముడు సినిమాకు కూడా ఎడిటర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ పనిచేశారు. తమ్ముడు సినిమాలో ట్రావెలింగ్ సోల్జర్ పాటను ఇంగ్లీషులో పెడదామని పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఆ సినిమా యూనిట్ లో చాలామంది, అలాగే నిర్మాత కూడా వద్దని చెప్పారట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం.. లేదు ఇంగ్లీషులోనే బాగుంటుంది. ఈ పాట తెలుగులో అంతగా కిక్ ఇవ్వదని చెప్పి ఇంగ్లీషులోనే పట్టుబట్టి చేయించారట. అది ఆ తర్వాత థియేటర్లో విడుదలై పెద్ద సెన్సేషన్ అయింది. అదే ధైర్యంతో బద్రి లో కూడా మొదటి పాటను హిందీలో పెట్టారు.
సాంగ్స్ షూట్ చేసిన పవన్
ఇక ఈ సినిమాలో హే చికితా సాంగ్ ఎంత పెద్ద హిట్టు అనేది అందరికీ తెలిసిందే. 25 సంవత్సరాలైనా ఆ పాట ఇప్పటికీ జనాల చెవుల్లో రింగ్ అవుతూనే ఉంటుంది. బద్రి ఎడిటింగ్ దశలో ఆ పాట తీసేద్దామని ఎడిటర్ రోజూ ఎడిటింగ్ లో కూర్చేనే పవన్ కళ్యాణ్ తో చెప్పారట. సినిమా ఫ్లో కి అడ్డుపడుతుందని, అక్కడ సాంగ్ అంతగా అవసరం లేదని ఎడిటర్ పవన్ తో అన్నారట. ప్రాబ్లం ఏం కాదని, ఆ సాంగ్ యూత్ కి మాస్ కి బాగా పడుతుందని, సినిమాకి హైలైట్ అవుతుందని మీరు ఏమి ఆలోచించకుండా నేను చెప్పినట్టు చేయండి అని పవన్ చెప్పారట. అయిష్టం గానే ఒప్పుకుని, ఒకవేళ సరైన స్పందన లేకపోతే మార్నింగ్ షో నుండే ఆ సాంగ్ ని రీల్స్ నుంచి డిలీట్ చేయాలని నిర్మాత అలాగే మిగతా యూనిట్ మిగతా యూనిట్ అనుకున్నాట.

ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్, మిగతా సినిమా యూనిట్ ఎలా ఉందో చూద్దామని హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లోని థియేటర్ కి వెళ్ళారట. హే చికిత్తా అంటూ సాంగ్ ప్రారంభమవగానే థియేటర్లో జనాలు పూనకాలు వచ్చినట్టు ఊగిపోతుండడంతో, అది చూసిన వీళ్ళందరికీ మతి పోయిందట. అప్పుడే పవన్ కళ్యాణ్ కున్న విజన్ కి, ఆయనకున్న న్యూథాట్ ప్రాసెస్ కి ఆశ్చర్య పోయానని, ఆయన ఎప్పుడూ కూడా పది ఇరవై సంవత్సరాలు ముందుకు ఆలోచిస్తారు అంటూ ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ బద్రి అనుభవాలు చెప్పారు. బద్రి సినిమాలోని హే చికితా, బంగాళాఖాతంలో సాంగ్స్ ని పవన్ దర్శకత్వంలో షూట్ చేసారు.
రికార్డుల బద్రి
థియేటర్ రికార్డ్స్
బద్రి సినిమాలో ఆ క్లాస్ టేకింగ్, సింగల్ లైనర్ మాస్ డైలాగ్స్, పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పర్ఫామెన్స్ మాస్, యూత్ ప్రేక్షకుల్ని ఆయనకి వీరాభిమానులుగా మార్చేశాయి. అప్పట్లో బద్రి సినిమా చాలాచోట్ల రికార్డ్స్ ని బద్దలు కొట్టింది. ఆ రోజుల్లోనే దాదాపు 20 కోట్ల దాకా భారీ వసూళ్లు సాధించిన బద్రి సినిమా చాలా చోట్ల పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొత్త రికార్డ్స్ ని, అలాగే టౌన్ రికార్డ్స్ ని, సిటీ రికార్డ్స్ ని, ఆల్ టైం రికార్డ్స్ ని సాధించింది. బద్రి సినిమా కాకినాడ శ్రీదేవి థియేటర్లో దాదాపు 60 రోజులు పాటు నాలుగు ఆటలు ఫుల్ అయ్యి ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 36 కేంద్రాల్లో వందరోజులు ఆడింది.
‘గూస్ బంప్స్’ క్రియేటర్స్
పవన్, ప్రకాష్ రాజ్
హీరోలు ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఉంటారు అందులో కొన్ని హిట్ అవుతుంటాయి కొన్ని ప్లాప్ అవుతుంటాయి అలాగే పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ మూవీస్ ఉన్నాయి.. ప్లాప్ మూవీస్ ఉన్నాయి. కానీ ఈ బద్రి సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక ప్రతిభావంతుడైన దర్శకుడు పూరి జగన్నాథ్ ని బహుమతిగా ఇచ్చింది. ” నువ్వు నందా అయితే, నేను బద్రి.. బద్రీనాథ్” అయితే ఏంటి అంటూ ప్రతి నాయకుడు ప్రకాష్ రాజ్ తో పవన్ కళ్యాణ్ చేసిన రచ్చ ఇప్పటికింకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య నడిచే సన్నివేశాలు బద్రి సినిమాకి ఆయువు పట్టుగా నిలిచాయి. తనదైన డైలాగ్ డెలివరీతో ప్రకాష్ రాజ్, తనదైన మేనరిజమ్స్ తో పవన్ కళ్యాణ్ ఒక సాధారణ సన్నివేశానికి కూడా అసాధారణ మెరుగులు అద్దారు. ఇద్దరు ప్రతిభావంతులైన నటీనటులు స్క్రీన్ పై తలపడుతుంటే చూస్తున్న ప్రేక్షకులకి కన్నుల పండుగ కదా.. బద్రి విషయంలో కూడా ఇదే జరిగింది.

ఇక హీరోయిన్స్ గా నటించిన అమీషా పటేల్ తన గ్లామర్ తో ఆకట్టుకోగా, రేణు దేశాయ్ కూడా సినిమాకి చాలా ప్లస్ అయింది. వీళ్లిద్దరూ కూడా సినిమాకి న్యూ లుక్ రావడంలో చాలా హెల్ప్ అయ్యారు. ఇక బద్రి అనగానే గుర్తొచ్చేది సంగీత దర్శకుడు రమణ గోగుల. తమ్ముడు సినిమాతో మొదలైన పవన్ కళ్యాణ్ రమణ గోగుల జర్నీ బద్రి సినిమాతో పీక్స్ కెళ్ళింది. రమణ గోగుల పాడిన పాటలు పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ గా సింక్ అవడంతో, దీనికి ముందు వచ్చిన తమ్ముడు సినిమా పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి.
బద్రి..బద్రినాద్
ఎప్పటికీ చెరగని ముద్ర
అదే ట్రెండును కంటిన్యూ చేస్తూ బద్రి సినిమాలో రమణ గోగుల సరికొత్త ట్యూన్స్ తో చెలరేగిపోయాడు. అప్పటి వరకు వినని కొత్త ట్యూన్స్ ఈ సినిమాతో తెలుగు సినిమాకి పరిచయం చేశాడు రమణ గోగుల. పవన్ కళ్యాణ్ సినిమాలతో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న రమణ గోగుల ఆ తర్వాత ఎన్నో సినిమాలకు సంగీత దర్శకుడుగా తన ప్రతిభ చూపించారు. పవన్ కళ్యాణ్ నటించిన టాప్ టెన్ మూవీస్ లో తీసుకుంటే అందులో బద్రి కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గా కాకుండా బద్రిగా పవన్ కళ్యాణ్ చూపించిన అభినయం, ప్రత్యేకత ఈ సినిమాని ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ నిలిచేలా చేసింది. బద్రి సినిమా అనగానే.. పవర్ ఫుల్ డైలాగ్స్.. హుషారు సాంగ్స్. స్టైల్, ఫైట్స్.. ఇలా ఒకటేమిటి ఎన్నో గుర్తుకొస్తాయి. అందుకే పవన్ సినిమా కెరియర్ లోనే కాదు, తెలుగు సినిమా ప్రస్థానంలోనూ కూడా బద్రీనాథ్ తనదైన ముద్ర వేశాడు.








