గుండెనిండా గుడిగంటలు
కుటుంభం మెచ్చిన కథ
Gunde Ninda Gudigantalu Serial 27/05/2025 సాధారణంగా ఏదైనా సినిమా నిడివి రెండున్నర గంటలు ఉంటుంది. ఆ రెండున్నర గంటల సమయంలోనే కథని ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలాగా చెప్పాల్సిన అవసరం వస్తుంది. అందుకే సినిమాల్లో తక్కువ పాత్రలు, తక్కువ సీన్స్ ఉంటాయి. అదే సీరియల్ విషయానికి వస్తే ఏదైనా విషయాన్ని విపులంగా చెప్పే వీలుంటుంది. ప్రతి పాత్ర యొక్క దృష్టి కోణాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించే అవకాశం కలుగుతుంది. అందుకే సీరియల్ లోని పాత్రలతోనూ, సన్నివేశాలతోనూ ప్రేక్షకులు మమేకమవుతారు. అలాంటి విజయవంతమైన సీరియల్స్ లో మాటీవీలో ప్రసారమవుతున్న “గుండె నిండా గుడిగంటలు” ఒకటి. ఆకట్టుకునే కథనాలతో సాగుతున్న ఈ సీరియల్ మంగళవారం (27/05/2025) ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం.
హైలెట్స్
- శివ గురించి నిజం తెలుసుకున్న మీనా
- బాలు ఆటో ఎక్కిన రోహిణి
- కార్ అమ్మేసిన విషయం నిజమేనన్న బాలు
- ప్రభావతి పంచాయితీ..బోనులో బాలు
- బాలుని ఆటో డ్రైవర్ గా చూసి మీనా షాక్
బాలు ఆటో ఎక్కిన రోహిణి
కారు అమ్మలేదు అన్నట్టు బాలు కవరింగ్
బాలు నడుపుతున్నఆటోలో రోహిణి, అలాగే పార్లర్ లో పనిచేసే అమ్మాయి ఎక్కుతారు. కార్ అమ్మేసినట్టు రోహిణి కి తెలియకుండా ఉండడానికి బాలు తన స్నేహితుడు రాజేష్ తో ఫోన్లో మాట్లాడుతాడు. తన కారు వేరే ఫ్రెండ్ కి ఇచ్చినట్టుగానూ, రెండు రోజుల్లో మరో పెద్ద ట్రిప్పు దానికోసం అన్నట్టుగా రోహిణికి అనుమానం రాకుండా రాజేష్ తో అంటాడు. రోహిణి కూడా పార్లర్ దగ్గర కాకుండా మరో స్టాప్ లో ఆటోని ఆపమంటుంది. పార్లర్ ఇంకా దూరం ఉంది కదా అని పార్లర్ లో పనిచేసే అమ్మాయి రోహిణి తో అంటే, నీకేమీ తెలియదు. నువ్వు ఊరుకో అంటూ ఒక స్టాప్ లో దిగిపోతుంది.
పార్లర్ విషయం తెలుసులే
కార్ లేదని నేను కవర్ చేస్తుంటే, నువ్వు పార్లర్ లేదని కవర్ చేస్తున్నావు నాకు అర్థం అయింది లే అని అనుకుంటాడు బాలు. వాళ్లు ఆటో దిగి వెళ్లిపోయిన తర్వాత బాలుకు తెలిసిన ఒక వ్యక్తి వచ్చి కారు అమ్మేసావట కదా? అని అడుగుతాడు. అవునని చెప్తాడు బాలు. ఇదంతా పక్కనే దాక్కుని రోహిణి వింటుంది. రోహిణికి బాలు కారు అమ్మేసాడనే విషయం అర్థమవుతుంది.
రోహిణి వెలిగించిన నిప్పు
బోను ఎక్కిన బాలు
ఇంటికి వచ్చిన రోహిణి మనోజ్ తో విషయం చెబుతుంది. వాడు కారు నడిపితే ఏంటి? ఆటో నడిపితే ఏంటి? అన్నట్టుగా మనోజ్ మాట్లాడుతాడు. ఆ కారు మీ ఇంటి డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టి కొన్నారు. అది అమ్మితే ఇంట్లో వాళ్ళు అందరికీ చెప్పాలి కదా? నీకు కూడా ఇప్పుడు 14 లక్షలు అవసరం కాబట్టి బాలుని ఆ డబ్బులు ఏం చేసావని అడుగు అంటుంది రోహిణి. వాడి నోట్లో నోరు పెట్టనని మనోజ్ అంటే, ఈ విషయం ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తానని, హాల్లో పూజగదిలో ప్రభావతి పూజ చేస్తూ ఉండడంతో, రోహిణి ప్రభావతి దగ్గరికి వెళుతుంది. దేవుడి ఫోటోల ముందు దీపం వెలిగించి ఆ కుటుంబంలో నిప్పు పెట్టినట్టుగా ఆనందం ఫీల్ అవుతుంది. ఏంటమ్మా ఇంత ఆనందంగా ఉన్నావు? అని ప్రభావతి అడిగితే, బాలు సంగతి బయటపెడుతుంది.
బాలు గాడు దొరికాడు
ఈ ఇంట్లో ఎవరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా ఆంటీ అని రోహిణి ప్రభావతి తో అంటుంది. దానికి సమాధానంగా ప్రభావతి, ఇంట్లో ఎవరెవరు ఏం చేస్తున్నారో అందరి గురించి చెప్తుంది. బాలు గురించి మాత్రం చెప్పదు. బాలు ఏం చేస్తున్నాడో తెలుసా? అని అడిగితే ఏం చేస్తాడు విమానం ఏమీ నడపట్లేదు కదా. కారే కదా నడుపుతున్నాడు అంటుంది ప్రభావతి. ఇప్పుడు ఆ కారు కూడా లేదని, ఆటో నడుపుతున్నాడని, తను తన ఫ్రెండు బాలు ఆటో ఎక్కామని రోహిణి చెప్పడంతో ప్రభావతి షాక్ అవుతుంది. అందుకేనేమో ఈమధ్య కార్ ఏది అని అడుగుతుంటే, షెడ్ లో ఉంది అని అబద్ధం చెప్తున్నాడు అంటుంది ప్రభావతి.
డబ్బు ఏం చేసినట్టు?
బాలు కారు అమ్మేసి అద్దెకి నడుపుతున్నాడని, ఇంటి పత్రాలు తాకట్టుపెట్టి కారు కొంటే, ఎవరికీ చెప్పకుండా అమ్మేసే హక్కు బాలుకి ఎక్కడుందని రోహిణి అంటుంది. కారు అమ్మేసిన డబ్బులు ఏం చేశాడో తెలియాలనీ, మీనా వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చాడా? మీనా చెల్లి, తమ్ముడు చదువులకి ఖర్చు చేశాడా అనే విషయం తెలియాలని ప్రభావతిని మరింత రెచ్చగొడుతుంది. ఆ మాటకి ప్రభావతి ఎప్పుడూ అందరూ వాడికి దొరుకుతారు. ఈసారి వాడు నాకు దొరికాడు. నేను అడుగుతా అనగానే, మీ మాట బాలు వినడని రోహిణి అంటుంది. ఎవరు అడిగితే వాడు సమాధానం చెప్తాడో, వాళ్లతోనే అడిగిస్తానని ప్రభావతి అక్కడనుండి వెళ్ళిపోతుంది. ఈ చిచ్చు ఇంకా పెద్దదవ్వాలని, అందులో బాలు సతమతమవ్వాలని రోహిణి ఆనందంగా కోరుకుంటుంది.
ఆటో బాలుని చూసిన మీనా
ఎందుకు ఇలా చేస్తున్నాడు?
బాలు తన ఆటోలో ఒక పెద్దామెను పూల మార్కెట్ కి తీసుకొస్తాడు. పూలు కొని అమ్మడానికని ఆమె బాలుతో చెప్తుంది. అయితే మీరు కొనుక్కున్న తర్వాత మళ్లీ వచ్చి మిమ్మల్ని మీ కొట్టు దగ్గర దిగబెడతానని, ఈ లోపు నేను వేరే కిరాయి వేసుకుని వస్తానని బాలు అంటాడు. ఆమె డబ్బులు తీసుకోమన్నా తీసుకోకుండా మళ్లీ మిమ్మల్ని దింపిన తర్వాత తీసుకుంటానని చెప్పి బాలు వెళ్లిపోతాడు. కొంచెం సేపటి తర్వాత ఆ పెద్దామె, పూల సంచులు మోయలేక నడుచుకుంటూ వస్తుంటే, అటుగా వచ్చిన మీనా చూస్తుంది. ఏమైనా సాయం చేయమంటారా? అంటే ఆ పెద్దామె వద్దని ఆటో డ్రైవర్ వస్తానన్నాడని చెప్తుంది. సరేనని మీనా ముందుకి వెళ్ళిపోతుంది.
మీనాని గమనించని బాలు
మీనా అలా ముందుకి వెళ్ళగానే బాలు ఆటోతో అక్కడికి వస్తాడు. ఆ పెద్దామె ముందు ఆగుతాడు. ఇంతలో అనుకోకుండా వెనక్కి తిరిగిన మీనా ఆటో లోంచి బాలు దిగడాన్నిచూసి షాక్ అవుతుంది. ఏంటి ఈయన కారు ఏం చేశారు? ఆటో డ్రైవింగ్ చేస్తున్నారేంటి అనుకుంటుంది. బాలు ఆ పెద్దమ్మ దగ్గర ఉన్న పూల సంచులను తీసుకుని ఆటోలో పెట్టుకుంటాడు. ఆమెని ఎక్కమని చెప్తాడు. మీనాని బాలు గమనించడు. ఆటో యూటర్న్ తీసుకుని వెళ్ళిపోతాడు. కారు డ్రైవింగ్ చేయకుండా, ఆటో ఎందుకు నడుపుతున్నాడు? నాకు కూడా ఈ విషయం ఎందుకు చెప్పలేదు? అని తనలో తాను అనుకుంటూ బాధపడుతుంది.

ప్రభావతి పంచాయితీ
దోషిగా బాలు
మీనా పూల సంచితో ఇంట్లోకి వస్తుంది. అది చూసిన ప్రభావతి, రండి పెద్ద బిజినెస్ ఉమెన్ గారు అని ఎటకారంగా మాట్లాడుతుంది. ఇంతలో అక్కడికి రవి, శృతి, మనోజ్, రోహిణి వస్తారు. ఇకనుండి ఈ పూలగంపకి తోడు ఆ ముళ్ళకంప కూడా పూల కొట్టు దగ్గరే ఉంటుంది అంటూ బాలుని ఉద్దేశించి మాట్లాడుతుంది. ఏదైనా చెప్తే సూటిగా చెప్పండి అంటుంది మీనా. బాలు అన్నయ్య అక్కడ ఎందుకు ఉంటాడు, కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు కదా? అంటాడు రవి. అది విన్న ప్రభావతి, ఇప్పుడు కారు పోయి కొత్తగా ఆటో వచ్చిందని అంటుంది. అది విన్న రోహిణి సంతోషంగా చూస్తుంది. నువ్వు, నీ మొగుడు ఎన్ని నాటకాలు ఆడతారు. కారు పోయి ఆటో ఎందుకు వచ్చింది? అని మీనాని ప్రభావతి ప్రశ్నిస్తుంది. ఆ విషయం నాకేం తెలుసు? ఆయన్నే అడగండి అంటుంది మీనా.
బాలుని నిలదీసిన సత్యం
నువ్వు, నీ మొగుడూ ఎన్ని నాటకాలు ఆడతారు? అని నిలదీస్తుంది ప్రభావతి. ఇంతలో అక్కడికి సత్యం కూడా వస్తాడు. ఏంటి ప్రభావతి మళ్లీ పంచాయతీ పెట్టావా? కోడల్ని నిలబెట్టి నిలదీస్తున్నావు? అంటాడు సత్యం. బాలు కారు అమ్మేసి ఆటో తోలుతున్నాడట, ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి మరీ కొన్నాం కదా? వాడు కారు అమ్మి ఆ డబ్బుని ఏం చేశాడు? అని ప్రభావతి సత్యంతో అంటుంది. ఆ మాటలు విన్న సత్యం షాక్ అవుతాడు. వీళ్ళిద్దరూ కలిసే ఇదంతా చేస్తున్నారని ప్రభావతి అనడంతో, బాలు ఆటో డ్రైవింగ్ చేస్తున్న విషయం ఇంతకుముందే నాకు మార్కెట్లో చూసినప్పుడు తెలిసిందని, మీనా అంటుంది. ఇంతలో అక్కడికి బాలు వస్తాడు. అదిగో వచ్చాడు మన “భాషా” అంటాడు మనోజ్.
నిజం ఒప్పుకున్న బాలు
వెంటనే ప్రభావతి, ఆరోజు తనని బోనులో నిలబెట్టి ప్రశ్నలు వేశాడని, ఈరోజు వీడికి కూడా ఇలాగే జరగాలని మనోజ్ ని బోను తీసుకురమ్మని చెప్తుంది. బాలుని బోనులో నిలబెడుతుంది. కారు ఎందుకు అమ్మేసావని, ఆటో ఎందుకు డ్రైవింగ్ చేస్తున్నావని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. డ్రైవర్ అన్న తర్వాత అన్ని బళ్ళు తోలాలని, నేను అదే చేస్తున్నానని బాలు అంటాడు. ఆటో తోలుతున్న సంగతి, ఆటో అద్దెకి తీసుకున్న సంగతి నిజమా కాదా? అని అడిగితే, నిజమేనని బాలు అంటాడు. అయినా ఇదంతా మీకు ఎవరు చెప్పారు? ఆ చెప్పినవాళ్లు సంగతి నాకు మొత్తం తెలుసు. నేను గనక నోరు విప్పానంటే, బోన్ లో ముద్దాయి మారిపోతాడు అంటాడు బాలు. ఆ మాటలు విన్న రోహిణి కంగారుపడుతుంది. తన గురించి సీక్రెట్స్ బాలుకి తెలిసాయా? అని సందేహపడుతుంది.
తప్పలేదు నాన్న
కారు అమ్మేసి ఆ డబ్బులన్నీ ఎక్కడో దాచేసాడని ప్రభావతి అంటుంది. ఆరోజు నేను పార్కులో ఉంటే వీడియో తీసి పార్కులో పడుకుంటున్నాడని, పల్లీలు తింటున్నాడని మీ అందరి ముందు నన్ను తక్కువ చేశాడు. మరి ఈరోజు వీడు ఏం చేస్తున్నాడు అని మనోజ్ అంటాడు. ఆయన ఏం చేసినా, ఆలోచించే చేస్తారు మావయ్య అంటుంది మీనా. నువ్వు నోరు ముయ్యి ప్రతిదానికి, వాడిని వెనకేసుకుని వస్తావు అని మీనా పై అరుస్తుంది ప్రభావతి. ఎందుకు ఇలా చేసావ్ అని సత్యం, బాలుని అడుగుతాడు. తనకి ఈమధ్య ఊహించని సమస్యలు ఎదురయ్యాయని, అవన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండడం కోసం కారు అమ్మేయాల్సి వచ్చిందని బాలు అంటాడు. కారు అమ్మిన డబ్బు ఎక్కడ పెట్టావు? ఏం చేశావు? అంటూ మరో రకంగా బాలుని ప్రశ్నిస్తుంది ప్రభావతి.
రేపటి ప్రోమో
టాక్సీ స్టాండ్ కి వచ్చిన మీనా బాలు ఫ్రెండ్ రాజేష్ తో మాట్లాడుతుంది. తను కారు అమ్మేసి ఆటో నడుపుతున్నాడని, ఇదంతా నాకు ఎందుకు చెప్పలేదని రాజేష్ ని నిలదీస్తుంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో గుణ, శివల వల్ల జరిగిన గొడవ గురించి చెప్పి, మా అప్పులు తీర్చడానికే బాలు కారు అమ్మేయాల్సి వచ్చిందని, మీనా కి మొత్తం వివరిస్తాడు రాజేష్. అది విన్నమీనా, వాడికి ఎంత ధైర్యం? అంటూ శివని ఉద్దేశించి అంటుంది. వెంటనే మీనా బాలు కలుస్తారు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. ఈరోజు ఎపిసోడ్ ముగిసిన విధానాన్ని బట్టి చూస్తే రేపటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది.
విశ్లేషణ
ఈ సీరియల్ లో కథానాయక పాత్ర బాగుంటుంది. ఈ పాత్రలో మీనాని చూస్తుంటే నాకు నా భార్య గుర్తొస్తూ ఉంటుంది. ఇందులో భార్యాభర్తలు అయిన బాలు అలాగే మీనా పాత్రల లాగానే, మా నిజజీవితంలో కూడా కొన్ని సంఘటనలు ఇంచుమించు జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మీనా ప్రవర్తించే పద్ధతి, నాకు నా భార్యను గుర్తు చేస్తూ ఉంటుంది. మేమిద్దరం కలిసి ఈ సీరియల్ క్రమం తప్పకుండా చూస్తూ ఉంటాం.
సీరియల్ చూసే సమయంలో మా నిజ జీవితానికి దగ్గరగా ఏవైనా కథలో జరిగితే, ఇది మన జీవితంలో జరిగింది కదా? నువ్వు ఆ టైంలో ఇలానే ప్రవర్తించావు కదా? అని తనను నేను ప్రశ్నిస్తూ ఉంటాను. మన నిజ జీవితంలో జరిగే సంఘటనలను, సమస్యలను, సవాళ్లను ఈ కథలో చక్కగా చూపిస్తున్నారు. అందరూ ఐడెంటిఫై అయ్యే కథ, కథనాలు ఈ సీరియల్ లో ఉన్నాయి కాబట్టే ఇది విజయవంతంగా ముందుకు వెళుతోంది. మరి ఈ సీరియల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన సైట్ ని విజిట్ చేయండి.








