రంగంలోకి పవన్
ఖుషి ఖుషీగా నిర్మాత ఏ ఎం రత్నం
వీరమల్లు వీరంగం | Hari Hara Veeramallu Movie చాలాకాలం తర్వాత నిర్మాత ఏ ఎం రత్నం ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. నిన్న మొన్నటి వరకు ఎంతో ఆందోళనతో ఉన్న ఆయన, ఒక్కసారిగా ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. దీనికంతటికీ కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరి కలయికలో తెరకెక్కిన “హరిహర వీరమల్లు” సినిమా ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతుంది. నిన్న మొన్నటి వరకు ఏమాత్రం బజ్ లేని హరిహర వీరమల్లు ఒక్కసారిగా పవన్ రాకతో ఫుల్ ట్రేండింగ్ లోకి వచ్చేసింది. వరుస పెట్టి మీడియా మీట్లు, గ్రాండ్ రిలీజ్ ఈవెంట్లతో పవన్ “హరిహర వీరమల్లు” సినిమాను పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. మొన్నటివరకూ ఈ సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని కంగారు పడిన నిర్మాత ఏం రత్నం ఆనందానికి కారణం ఇదే..
అవాంతరాల హరి హరా
ఆశలు వదిలేసుకున్న ఫ్యాన్స్
దాదాపు ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ క్రేజీ ప్రాజెక్టు అనేక అవాంతరాలను, ఒడిదుడుకులను ఎదుర్కొని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ సినిమా నిర్మాణ సమయంలో అసలు ఈ సినిమా ముందుకెళ్తుందా? ఉంటుందా లేదా? అనే అనుమానాలు అటు చిత్ర యూనిట్ లోను, ఇటు పవన్ ఫ్యాన్స్ లోను కూడా నెలకొన్నాయి. రెండు పాండమిక్స్ హరిహర వీరమల్లు సినిమాని అనుమానంలో పడేసాయి. దానికి తోడు ఆంధ్రప్రదేశ్లో అప్పటికే రాజకీయ వేడి ఊపందుకోవడంతో, పవన్ కళ్యాణ్ టెంపరరీగా సినిమాలను పక్కనపెట్టి తన రాజకీయాలతో బిజీ అయిపోయాడు. ఈ పరిణామాలు దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ ఈ ప్రాజెక్టు నుండి బయటకు వెళ్ళేటట్టు చేశాయి.
పాపం క్రిష్
అదే సీన్ రిపీట్
ఎంతో ప్రతిభ ఉండి కాలం కలిసి రాక దర్శకుడు క్రిష్ చాన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్నారు. నందమూరి బాలకృష్ణ తో క్రిష్ రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు పరాజయం తర్వాత దర్శకుడు క్రిష్ కి కాలం కలిసి రావడం లేదని చెప్పాలి. హిందీలో కంగనా రానాత్ తో చేసిన “మణికర్ణిక” ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. హీరోయిన్ కంగనా రానాత్, డైరెక్టర్ క్రిష్ ల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో మణికర్ణిక ప్రాజెక్టు నుండి క్రిష్ బయటకు వచ్చేసారు. దాదాపు 75% చిత్రీకరణ పూర్తి చేసుకున్న మణికర్ణిక మిగతా భాగాన్ని కథానాయక స్వయంగా పూర్తి చేసి దర్శకురాలిగా తన పేరుని ప్రకటించుకుంది. ఈ విషయంలో కంగనాకి, దర్శకుడు క్రిష్ కి సోషల్ మీడియా వేదికగా చిన్నపాటి యుద్ధమే జరిగింది అని చెప్పాలి.
పవన్ తో ప్రాజెక్ట్ సెట్
అంతలోనే అప్ సెట్
మణికర్ణిక విషయంలో ఇబ్బంది పడ్డ దర్శకుడు క్రిష్ అదే సమయంలో నిర్మాత ఏఎం రత్నం సంప్రదించి “హరిహర వీరమల్లు” ప్రాజెక్టుని పవన్ కళ్యాణ్ తో పట్టాలెక్కించారు. విభిన్న కథలతో సినిమాలను తెరకెక్కించే క్రిష్, అలాగే కొత్తదనానికి ఎప్పుడు వెల్కమ్ చెప్పే పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా అనగానే ఇదో విభిన్న సినిమా అవుతుందని సినీ అభిమానులు అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే 17వ శతాబ్దంలో కోహినూర్ డైమండ్ రాబరీ చుట్టూ జరిగిన ఒక కల్పిత వీర గాధగా హరిహర వీరమల్లు సినిమాని దర్శకుడు క్రిష్ ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ఏ నిర్మాతకైనా కత్తి మీద సామే. ఇటు సినిమాలను అటు రాజకీయాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతున్న పవన్ కళ్యాణ్ ఒక రకంగా సినిమాలకంటే. తన రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
వేడెక్కిన రాజకీయం
చల్లారిన వీరమల్లు
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మంచి హీట్ మీద ఉన్నాయి. అధికార పార్టీని గద్దె దించడానికి కూటమితో చేతులు కలిపిన పవన్ కళ్యాణ్ తన రాజకీయ వ్యూహాలతో, రాజకీయ సభలతో క్షణం తీరిక లేకుండా పోరాటం చేశారు. దీనివలన ఆయన చేస్తున్న హరిహర వీరమల్లు, ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ఓజి, అలాగే దర్శకుడు హరీష్ శంకర్ తో మొదలుపెట్టిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. పవన్ మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వచ్చి షూటింగ్ చేస్తాడో తెలియక నిర్మాతలు సైలెంట్ అయిపోయారు. ఇలాంటి డైలమా స్థితిని ఎప్పటినుంచో అనుభవిస్తున్న దర్శకుడు క్రిష్, ఇక లాభం లేదని హరిహర వీరమల్లు ప్రాజెక్టు నుండి బయటికి వెళ్లిపోయారు.
డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఎంట్రీ
వీరమల్లుని గట్టేక్కిస్తాడ?
డైరెక్టర్ క్రిష్ హరిహర వీరమల్లు ప్రాజెక్టు నుండి వాకౌట్ చేసిన తర్వాత ఇక ఈ సినిమా ఆగిపోయినట్టేనని అందరూ భావించారు. ఎవరూ ఊహించిన విధంగా ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ తీసుకున్నారు. దర్శకుడు జ్యోతి కృష్ణ విజన్ ఈ సినిమా కోసం ఆయన చేసిన రీసెర్చ్ పవన్ కళ్యాణ్ కి నచ్చడంతో జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమాని పూర్తి చేయడానికి ఒప్పుకున్నారు. మళ్లీ షూటింగ్ ప్రారంభించుకున్న హరిహర వీరమల్లు చిత్రంలోని కొన్ని సన్నివేశాలను మళ్ళీ రీషూట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఈ సినిమాని ఎన్నో ఒత్తిళ్ల మధ్య దర్శకుడు జ్యోతి కృష్ణ విడుదలకు సిద్ధం చేశారు.

వీక్ పబ్లిసిటీ
పవర్ ఎంట్రీ తో హైప్
ఇన్ని అవాంతరాలు దాటుకుని, ఎన్నో రిలీజ్ డేట్స్ మార్చుకుని ఫైనల్ గా ఈనెల 24న విడుదలవుతున్న హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్, మొన్నటి వరకు చాలా వీక్ గా ఉన్నాయని చెప్పాలి. సినిమా దర్శకనిర్మాతలు, చిత్ర కథానాయక నిధి అగర్వాల్ తప్పితే మిగతా నటీనటులు ఎవరు కూడా ఈ ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. దాంతో సినిమాకి బజ్ క్రియేట్ అవలేదు. ఈ విషయంలో ఆందోళనగా ఉన్న నిర్మాత రత్నం కి హీరో పవన్ కళ్యాణ్ ఫుల్ సపోర్ట్ గా నిలిచి, హరిహర వీరమల్లు ప్రమోషన్స్ ని పిక్ స్టేజ్ కి తీసుకెళ్తున్నారు. మొదటగా మీడియా మీట్ తో హరిహర వీరమల్లు ప్రమోషన్స్ చేసిన పవర్ స్టార్ ఆ తర్వాత శిల్పకళా వేదికలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా జరిగేటట్టు చేశారు.
సనాతని వీరమల్లు
రైట్ టైం లో కరెక్ట్ మూవీ
పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన కథాంశం అంటే, దేశభక్తి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కడంతో ఆయన ఈ సినిమాని మరింత ఉత్సాహంగా జనం ముందుకు తీసుకెళ్తున్నారు. 17వ శతాబ్దంలో ఔరంగజేబుని ఎదిరించిన ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ గా హరిహర వీరమల్లు సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. హిందువుగా జీవించాలి అంటే పన్ను కట్టాల్సిన ఆ రోజుల్లో మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ధీరుడు గా పవన్ ఈ సినిమాలో కనిపిస్తారు. పవన్ కి ఇష్టమైన చరిత్ర, అలాగే దేశభక్తి చిత్రం కావడంతో ఆయన ఇంతకుముందు ఏ సినిమాకు చెప్పని విషయాలను హరిహర వీరమల్లు మీడియా మీట్ లో చెప్తున్నారు. అలాగే తనను నమ్ముకుని ఎన్నో ఏళ్ల నుంచి ఇంత భారీ ప్రాజెక్టు మధ్య సతమతమవుతున్న నిర్మాత ఏఎం రత్నం ని ఈ సినిమాతో ఫైనాన్షియల్ గా ఒడ్డున పడేసే ప్రయత్నాలు పవన్ ముమ్మరంగా చేస్తున్నారు.
ఏమాత్రం హిట్ టాక్?
పవన్ స్టామినాకి పరీక్ష
ఎన్ని ఏళ్లయినా, ఎన్ని ప్లాప్స్ వచ్చినా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ మాత్రం మారదు అనడానికి మరోసారి హరిహర వీరమల్లు సినిమా ఉదాహరణగా నిలిచింది. ఈనెల 23న హరిహర వీరమల్లు ప్రీమియర్స్ తో ప్రారంభం కానుంది. 23వ తారీకు రాత్రి ప్రదర్శించే ప్రీమియర్ షో లకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్సీస్ లోనూ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా హరిహర వీరమల్లు ప్రీమియర్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అలాగే 24న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా విడుదలై ఏ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్ల పరంగా ఈ సినిమా రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ పండితులు అంటున్నారు. ప్లాప్ సినిమాతోనే రికార్డ్ కలెక్షన్లు సాధించే పవన్ ఈ సినిమాతో ఎలాంటి కొత్త రికార్డ్స్ క్రియేట్ క్రియేట్ చేస్తాడో అని సగటు సినీ అభిమాని ఆసక్తిగా చూస్తున్నాడు.








